zoya lobo : టెక్నాలజీ పరంగా ప్రపంచం ఎంతగానో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నప్పటికీ లింగ వివక్ష మాత్రం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అలాగే ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో కొంతమంది ట్రాన్స్ జెండర్లు సమాజంలో తమ మనుగడ సాగించేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు కష్టపడి పని చేస్తుంటే మరికొందరు మాత్రం పొట్టకూటి కోసం బిచ్చమెత్తుక్కుంటూ జీవనం సాగిస్తున్నారు. అయినప్పటికీ ట్రాన్స్ జెండర్లకి సమాజంలో తగిన గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభించడం లేదు. కానీ ఆమె మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించి కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బుతో ఒక కెమెరా కొని ప్రస్తుతం ఫోటో జర్నలిస్టుగా పని చేస్తూ చాలా గౌరవంగా లైఫ్ లీడ్ చేస్తోంది. అలాగే తన తోటి ట్రాన్స్ జెండర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకు ఎవరు ఆమె…? అసలు కధ ఏమిటి…?
పూర్తి వివరాల్లోకి వెళితే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగర పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓ కుటుంబంలో జోయా లోబో అనే ట్రాన్స్ జెండర్ జన్మించింది. అయితే జోయా లోబో కి 17 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు ఆమె ట్రాన్స్ జెండర్ అనే విషయం తెలియదు. దీంతో తాను కూడా అందరిలాంటి సాధారణ మనిషి అని అనుకుంది. కానీ 17 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆమె ప్రవర్తనలో కొన్ని మార్పులు గమనించిన తల్లిదండ్రులు జోయా లోబో ట్రాన్స్ జెండర్ గా గుర్తించారు.
దీంతో అప్పటి నుంచి జోయా లోబో కి కష్టాలు మొదలయ్యాయి. దాంతో తన తల్లిదండ్రుల నుంచి చిత్రహింసలు ఎదుర్కొని తప్పనిసరి సమయంలో కుటుంబం నుంచి బయటికి వచ్చింది. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లాలో తెలియని సమయంలో కొందరు ట్రాన్స్ జెండర్లు జోయా లోబో ను చేరదీశారు. దీంతో జోయా లోబో కొన్ని రోజుల పాటు వారితోనే ఉంటూ లోకల్ ట్రైన్స్ మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పొట్టకూటి కోసం బిచ్చమెత్తుకునేది. ఇక ఈ క్రమంలో ఎన్నో అవమానాలు మరియు అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొంది.
దీంతో సమాజంలో తనలాంటి వ్యక్తులకు ఎందుకు గౌరవ, మర్యాదలు ఇవ్వరనే విషయం పై తీవ్రంగా ఆలోచించింది. అంతేకాకుండా ఒక్కోసారి మనం చేసేటువంటి పనుల కారణంగా కూడా మన గౌరవ మర్యాదలు మరియు పేరు ప్రఖ్యాతలు నిర్ణయించబడతాయని తెలుసుకుంది. దాంతో తను కష్టపడి బిచ్చమెత్తుకుని సంపాదించిన డబ్బుతో కెమెరా కొని ఫోటోగ్రఫీ చేయడం మొదలు పెట్టింది. అలాగే ఇందుకు తన తోటి ట్రాన్స్ జెండర్ల సహాయం తీసుకుంది. ఈ క్రమంలో ఫోటోలను తీసి సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడం మొదలుపెట్టింది.
దీంతో జోయా లోబోలో ఉన్నటువంటి ఫోటోగ్రఫీ స్కిల్స్ ను గుర్తించిన ఓ సంస్థ లింగభేదం చూపకుండా ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో జోయా లోబో భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ ఫోటో జర్నలిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆమెలాంటి ఎంతో మంది ట్రాన్స్ జెండర్లకి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగే ఫోటోగ్రఫీ జర్నలిస్టుగా పని చేయగా వచ్చేటువంటి డబ్బులో కొంత మొత్తాన్ని తనలా కష్టపడి పని చేయాలని ఉన్నప్పటికీ ఆర్థిక స్తోమత లేనటువంటి వారికోసం ఉపయోగిస్తోంది.
అయితే జోయా లోబో ఆ మధ్య ఓ వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఈ క్రమంలో తాను పొట్ట కూటికోసం రైళ్లలో బిచ్చమెత్తునే సమయంలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఒకానొక సమయంలో తన కుటుంబ సభ్యుల నుంచి మరియు సమాజం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ప్రస్తుతం మంచి పొజిషన్ లో ఉన్నానని ఎమోషనల్ అయ్యింది.