Modi : పరుల సొమ్ము పాము వంటిదని పెద్దలు ఊరకే చెప్పలేదు
Modi : పరుల సొమ్ము పాము వంటిదని పెద్దలు ఊరకే చెప్పలేదు. ఎందుకంటే పరుల సొమ్ము దొంగలించినా లేదా ఎలాంటి కష్ట పడకుండా మన చెంతకు వచ్చినా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఇప్పటికే చాలామంది జీవితాల్లో నిరూపితమయి ఉంటుంది. అయినప్పటికీ కొందరు మాత్రం ఉచితంగా వచ్చిన సొమ్ములను మొదట్లో ఉపయోగించుకున్నప్పటికీ తమ జీవితాల్లో మాత్రం ఈ సొమ్ము పెద్దగా నిలబడదు. ఒక్కోసారి ఇబ్బందులు కూడా తప్పవు. అయితే ఓ వ్యక్తి అకౌంట్ లోకి పొరపాటున డబ్బు జమ కావడంతో ఆ వ్యక్తి ఏమి ఆలోచించకుండా ఖర్చు పెట్టి చివరికి అసలు నిజం బయట పడడంతో ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బు తిరిగి చెల్లించటం కోసం నానా తిప్పలు పడుతున్న ఘటన మహారాష్ట్ర రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లా పరిసర ప్రాంతంలో ధ్యానేశ్వర్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై చిన్న చిన్న వ్యాపారాలు, కాంట్రాక్టులు, అలాగే వ్యవసాయం చేసేవాడు. దీంతో తనకు ఉన్నంతలో లైఫ్ చాలా సాఫీగానే సాగిపోతోంది. అయితే ఇటీవలే ఉన్నట్లుండి ధ్యానేశ్వర్ బ్యాంకు ఖాతాలోకి దాదాపుగా పదిహేను లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి. దీంతో ధ్యానేశ్వర్ అసలు తన ఖాతాలోకి అంత డబ్బు ఉన్నట్లుండి ఎవరు పంపించారని ఆరా తీయాల్సింది పోయి ఏకంగా ఖర్చు పెట్టే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో దాదాపుగా 9 లక్షల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి సొంత ఇల్లు కట్టుకున్నాడు. మిగిలిన 6 లక్షల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టకుండా భద్రంగా బ్యాంకు ఖాతాలోనే ఉంచాడు.
అయితే అప్పుడే బ్యాంకు అధికారులు పొరపాటు జరిగినట్లు గుర్తించారు. ఇంకేముంది ధ్యానేశ్వర్ దగ్గరికి వచ్చి పొరపాటున తన అకౌంట్లో జమ అయిన డబ్బుని తిరిగే చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీంతో ఒక్కసారిగా ధ్యానేశ్వర్ ఖంగు తిన్నాడు. అలాగే తన వద్ద 15 లక్షల రూపాయలు మొత్తం లేదని దాంతో తన బ్యాంక్ ఖాతా లో ఉన్నటువంటి 6 లక్షల రూపాయలను తిరిగి బ్యాంకు అధికారులకు ఇచ్చేశాడు. మిగిలిన సొమ్ము చెల్లించడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని బ్యాంకు అధికారులను వేడుకుంటున్నాడు. మరి బ్యాంకు అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇటీవలే ధ్యానేశ్వర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ గతంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నల్లధనం వెలికితీసి ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలోకి దాదాపుగా 15 లక్షల రూపాయలు జమ చేస్తానని ఇచ్చిన హామీని గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిజంగానే నల్లధనాన్ని వెలికితీసి ఒక్కో రైతు ఖాతాలోకి 15 లక్షల రూపాయలు జమ చేశారని అనుకున్నామని అందువల్లనే డబ్బు గురించి బ్యాంకులో ఎంక్వయిరీ చేయలేదని తెలిపాడు. దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ అనుకోకుండా జరిగిన ఈ తప్పిదంలో బ్యాంకు అధికారుల పొరపాటు కూడా ఉందని కాబట్టి ధ్యానేశ్వర్ మిగిలిన మొత్తాన్ని చెల్లించడానికి కొంత సమయం లేదా వాయిదాల పద్ధతిలో చెల్లించే విధంగా గడువు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఎవరైనా బ్యాంకు ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు వచ్చి పడినా లేదా గుర్తు తెలియని వ్యక్తులు తమ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేసినా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. అలా కాకుండా బాంక్ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కదా అని ఉపయోగించుకుంటే కచ్చితంగా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
If you like our article about House constructed by mistake deposited money
Please allow notifications or click the bell icon to subscribe for notifications from
srimedianews.com
Keep Reading articles on our websites